ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్, సభ్యులను ఇటీవల ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు చైర్మన్ గా నియమితులైన జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని వెల్లడించారు. నియామకాల్లో ఏమాత్రం ఆలస్యానికి, అలస్యానికి చోటు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ న్యాయబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

టీఎస్పీఎస్సీని దేశంలోనే ఆదర్శ కమిషన్ గా తీర్చిదిద్దుతామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం గంటలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయున్నారు. ఇప్పటికే సభ్యులుగా నియమితులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణ కుమారి, ప్రభుత్వ టీచర్ సుమిత్ర ఆనందర్ తనోబాలు గురువారమే వీఆర్ఎస్ తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఇందులో గత పాలవర్గ సభ్యుడు విఠల్, టీఎన్జీవో మాజీ నేత కారం రవీందర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

వీరిద్దరిలో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారన్న ప్రచారం సైతం సాగింది. ఈ మేరకు వీరు సీఎంను కలిసి విజ్ఞప్తి సైతం చేశారు. అయితే సీఎం మాత్రం ఐఏఎస్ అధికారి అయిన జనార్ధన్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. గతంలో నోటిఫికేషన్లు విడుదలైన సమయంలో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. దీంతో అనేక మంది కోర్టుకు వెళ్లడంతో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అనేక నియామక ప్రక్రియలు ఏళ్ల కొద్దీ సాగాయి. ఈ పరిణామాలు ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారాయి. ఈ సారి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారి ఉంటే బాగుంటుందని సీఎం భావించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనార్ధన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారని సమాచారం.

ఇదిలా ఉంటే.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకమండలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్, సభ్యులను మంగళవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనల మేరకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా డా. బీ. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్)ను సీఎం నియమించారు. జానార్ధన్ రెడ్డి ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు.

Leave a Reply